థాకరే గారు పోయారు…..

అరే ఏందబ్బా!! బాంబేలో ఎవరో థాకరే అంట. పులంట. ఎవుర్నీ లెక్క చెయ్యడంట. ఆయన పట్టిన కుందేటికి మూడే కాళ్ళంట. మొన్నే పోయినాడంట. చానా మంది ఏడ్చి గుండెలు బాదుకున్నారంట. అందరూ అయ్యో పాపం పోయినాడు అని దిగులు పడినారంట. బాంబే పెద్ద పులి చచ్చిపోయింది అన్నారంట. ఆయన్ని చూసేదానికి లక్షల మంది వచ్చి పోయినారంట. బాంబే అంతా స్కూళ్ళు, ఆఫీసులు మూసేసినారంట పెద్దాయనకి గౌరవంగా. మినిష్టర్లూ, సినిమా వోళ్ళూ, అంబానీలూ, ఫ్యాక్టరీలోళ్ళూ, మామూలోళ్ళూ, చిన్నోళ్ళూ, పెద్దోళ్ళూ, అందరూ ఒచ్చి ఏడ్చినారంట. దహనానికి ఊరేగింపుగా తీసుకొని పొతావుంటే బండి అస్సలు కదలలేదంట. అంత మంది జనాలంట. మమ్మల్ని ఒదిలి పోవద్దు, తిరిగి వొచ్చేయి అని ఏడ్చినారంట. మొత్తానికి శివాజీ పార్కులో దానం కానిచ్చేసినారంట. ఒరే ఇంత పెద్దాయన పొయినాడా పాపం, ఈయన పేరు నేనెప్పుడూ ఇన్లేదే అని మా బుడ్డోడిని పిలిచి, “ఒరేయి ఈ థాకరే ఎవర్రా”? అని అడిగినా. వాడు చెప్పింది విని నా దిమ్మ తిరిగి మైండుబ్లాకయ్యిపోయింది.

వాళ్ళ నాయన (ఆయన కూడా థాకరేనే) బాంబే రాష్ట్రం నించి గుజరాతోళ్ళని వేరుచేసి మరాఠీ రాష్ట్రం కావాలని పోరాడినాడంట. గుజరాతోళ్ళేమో బాంబే మాకే కావాలని గొడవకి దిగినారంట. ఆ ఊళ్ళో మరఠీ వాళ్ళే ఎక్కువ వుండేదానివల్ల అది మరాఠీ వాళ్ళకే వచ్చిందనుకో, అది వేరే విషయం. ఐనా పెద్ద థాకరే సంగతి మనకెందుకులే.

ఇప్పుడు పోయిన థాకరే ముందు ఒక పేపర్లో బొమ్మలు గీసేవాడంట. తర్వాత ఆయనే పేపరు పెట్టినాడంట. ఆ తర్వాత వాళ్ళ నాయన సిధ్ధాంతాలని పుణికిపుచ్చుకొని శివసేన పార్టీ పెట్టినాడంట. ఆ పార్టీ మరాఠీ వాళ్ళ కోసం పోరాడే పార్టీ అంట. బాంబే లో వుద్యోగాలు మరాఠీ వాళ్ళకే రావాలని గొడవ పెట్టుకున్నాడంట. బాంబే వాళ్ళ వుద్యోగాలు గుజరాతోళ్ళు, బీహారోళ్ళు, మనోళ్ళు కొట్టేస్తావుండారని, వాళ్ళందర్నీ మహారాష్ట్ర నించి ఎళ్ళగొట్టాలని చెప్పినాడంట. పెద్ద డాన్ లాగా వ్యాపారాలు చేసుకొనే గుజరాతోళ్ళ నించి “మీరు వ్యాపారాలు చేసుకోవాలంటే మాకు డబ్బులివ్వాలి” అని దందాలు చేయించేవాడంట శివసేనోళ్ళతో. పాకిస్తానోళ్ళు ఎదవలు, వాళ్ళ వల్లే మనకిన్ని కష్టాలు, వాళ్ళ లాగే మనం వాళ్ళమీద బాంబులెయ్యాలి, హిందూ బాంబర్లని తయారు చేసుకోవాలని అన్నడంట అప్పుడెప్పుడో. ఆయన పిల్లోళ్ళు కూడా ఆయన లాగే తయారైనారు ఇప్పుడు. అప్పుడెప్పుడో షిర్డీలో తెలుగు బోర్డులుంటే షాపులు పగలగొట్టి ఓనర్లని బాదినారంట గుర్తుందా !! అది ఆ పెద్దాయన తమ్ముడి కొడుకు పార్టీ పనే అంట.

ఎటొచ్చీ ఇదంతా వినేటప్పటికి నాకు తలకాయ నొప్పొచ్చేసింది. మన పెద్దోళ్ళు చెప్తారు కదా “ఉద్దేశం మంచిదే అయినా పోయే దారి తప్పైనప్పుడు చెడ్డ ఫలితాలే వస్తాయి అని”. ఇదీ అలాంటిదే అని అనుకుంటున్నా.

మరాఠీ వాళ్ళకి వుద్యోగాలు రావాల్సిందే. కానీ దానికి వేరే వాళ్ళని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడమేందో నాకర్థం కాలేదు. ఏ వ్యాపారం చేసేవాడైనా నేను పైకి రావాలి అనే వేరే వూరికి పోయి వ్యాపారాలు చేసుకుంటాడు. పనోళ్ళంతా ఏదో కొంచెం పని దొరికి, కొంచెం తిండి దొరికితే చాలనుకొని పొట్ట చేత పట్టుకొని వస్తారు. అంతేగానీ మరాఠీ వాళ్ళని ఉద్యోగాల నించి, పన్ల నించి, వ్యాపారాల నించి తరిమేసి మనం గొప్పోళ్ళు అయిపోదాం అని వస్తారా? ఐనా మన దేశంలో ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు, పని చేసుకోవచ్చు అని కదా పెద్దోళ్ళు చెప్పింది? అంటే బాంబేలో అందరూ ఉండి పని చేసుకోవచు అనే కదా అర్థం. ఈ విషయం నాకే తెలుసు. ఆ గొప్ప రాజకీయ నాయకుడు థాకరేకి ఈ విషయం ఎందుకు తెలీదో!!!!!!

ఎవరినా చెప్పుంటే బాగుండు. రాజకీయ నాయకుడు అందరూ పని చేసుకోవడానికి పన్లు ఎలా పెంచాలి, కొత్త ఉద్యోగాలు ఎక్కడ్నించి తేవాలి అని ఆలోచించాలి కదా? అందర్నీ తరిమేసి మనం మాత్రమే పని చేసుకోవచ్చు అంటే ఎలాగబ్బా? అన్యాయం కాదా?

పాకిస్తానోళ్ళు బాంబులేసినారు, దాడులు చేసినారు అని హిందూ వాళ్ళూ కూడా బాంబులెయ్యాలి, చంపెయ్యాలి అంటే ఎలా? వాళ్ళకి, మనకి తేడా ఎంది అప్పుడు? మనం వేసామని వాళ్ళు, వాళ్ళు వేసారని మనం, ఇలా బాంబులేసుకుంటుంటే ఎమౌతుంది? ఐనా సామరస్యంగా కదా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సింది? అది ఒదిలేసి బాంబులేసెయ్యండి అంటే ఎట్టాగబ్బా?

సర్లే ఏదో పెద్దాయన పోయినాడు పాపం అని బాధ పడినా. రెండు లక్షల మంది వచ్చినారంటే అబ్బో అనుకున్నా. బాంబే అంతా షాపులు, స్కూళ్ళు, కాలేజీలు మూసేసినారంటే పెద్దాయనకి బాగా అభిమానులుండారని ఆనందించినా. ఈ రోజు పొద్దున పేపరు చూస్తే మళ్ళీ దిమ్మ తిరిగి మైండు బ్లాకైపోయింది.

బాంబేలో ఇద్దరమ్మాయిలని పోలీసులు అరెస్టు చేసినారంటే ఎందుకా అనుకున్నా. మొన్న షాపులన్నీ మూసేసినారు కదా పెద్దాయన కోసం. ఒక అమ్మాయి ఫేస్ బుక్కులో “రోజుకి ఎంతో మంది థాకరేలు పుడుతున్నారు, పోతున్నారు. వాళ్ళ కోసం మొత్తం బంద్ చెయ్యాలా ఎంటి? అయినా భగత్ సింగ్, ఆజాద్ల కోసం రెండు నిమిషాలైనా మౌనంగా వున్నామా ఎప్పుడైనా?” అని అడిగిందంట. అంతే. మన శివ సైనికులకి ఎక్కడ లేని కోపమొచ్చేసింది. ఆ అమ్మాయి బంధువుల హాస్పిటలు మీదకి మనుషులొచ్చేసి హంగామా చేసినారంట. ఇంకో గల్లీ శివసేన నాయకుడు ఆ అమ్మాయిల మీద పోలీసు కేసు పెట్టినాడంట. పోలేసులు కూడా అరెస్టు చేసేసినారంట.

పాపం ఆ అమ్మాయి అంత రెచ్చగొట్టేటట్లు ఏం మాట్లాడిందో నాకైతే అర్థం కాలేదు. “అవును కరెక్టే !! ” అన్న దానికి పాపం రెండో అమ్మాయి కూడా కేసులో ఇరుక్కుపోయింది. ఐనా ఈ అరెస్టు చేసిన పోలీసోళ్ళకు అసలు ఉద్యోగాలిచ్చిన ఎదవలెవరు? ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పుందో లేదో కూడా తెలుసుకోకుండా అరెస్టు చేసేయడమేనా? అసలు అందులో రెచ్చగొట్టేటట్లు ఏం లేదు కదా! ఇంగిత ఙానం వున్న ఏ ఎదవకైనా ఈ విషయం అర్థమయ్యుండేది కదా అని ఆ పోలీసుల తెలివితక్కువతనానికి జాలేసింది.

వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే పాపం. పొలిటికలోళ్ళకు భజన చేసేదానికి, వాళ్ళని కాపాడడానికి మాత్రమే కదా ఇప్పుడు పోలీసులుండేది. వాళ్ళు కేసు పెట్టమంటే పెట్టాలి, లోపలెయ్యమంటే ఎయ్యాలి. వాళ్ళకి మాత్రం బుర్ర ఉపయోగించే చాన్సెక్కడిది? ఇలాంటి తెలివితక్కువ సంఘటన ఇంకొకసారి జరగకూడదని మాత్రమే మనం కోరుకునేది.

పెద్ద గొర్రె ఎటు పోతే మిగతా గొర్రెలు కూడా అటే కదా వెళ్ళేది. పెద్ద థాకరే మనుషుల్ని విడగొట్టి, కొట్టి తరిమేయండి అంటే మిగతా థాకరేలు, శివసైనికుల నుంచి మనం ఇంకేం ఆశించగలం? ప్రేమతో మనుషుల్ని గెలుచుకోవచ్చేగానీ ద్వేషంతో కాదు. ఒక వేళ గెలుచుకోగలిగినా చరిత్రలో నిలబడలేరు. హిట్లర్ లాగా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే భయపడతారు. ఈ విషయం వాళ్ళు తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం.

—- ఈ మధ్య ఏం రాసినా ఇంటికి పోలీసులొచ్చేస్తున్నారు వాళ్ళు కేసు పెట్టినారు, వీళ్ళు కేసు పెట్టినారు అని. అలా కాకుండా ఇంక మీదట కొంచెం ఆలోచించి నిజంగా అరెస్టు చెయ్యాలి అని అనుకుంటే చేసుకోండి.

—- ఇందులో అన్నీ నిజాలే ఉన్నాయి. వికీపీడియా నుండి విషయం తీసుకొని నా అభిప్రాయాలు జోడించా. ఏదైనా తప్పులుంటే లైట్ తీసుకోండి. శివసైనికులకి చెప్పకండే..! 🙂

Advertisements